My Love Story
“నా ప్రేమ కథ”
__భానుచందర
సమయం రాత్రి ఎనిమిదయింది. ఇంటికి వెళ్లాలంటే బోర్. అలాగని వెళ్లకుండా ఉండలేను. తప్పదన్నట్లుగా ఇంటికి బయల్దేరాను. ఇంటికి వెళ్తూ..వెళ్తూ తోడుగా నా ప్రియ స్నేహితుడ్ని కూడా వెంటబెట్టుకుని ఇంటికి వెళ్ళాను.
తనని సోఫాలో కూచోబెట్టి..నేను ఇంటిలోని వాష్ రూమ్‌లో ఫ్రెష్ అయి వచ్చి కింద కూచున్నాను…నాతొ పాటు తను కూచుంది. తనని చూస్తూ… “లవ్ యు డార్లింగ్”. అంటూ నే..ముద్దు పెట్టుకుంటుంటే తను సిగ్గుల మొగ్గయింది.
ఇదుగో..ఈ ఒక్కరోజే నీతో గడిపేది...రేపటినుండి నా జాన్..నా ప్యార్ తోనే, నా టైమంతా..నువెంత టెంప్టింగ్ చేసినా.. ఎన్నెన్ని చిన్నెలు పోయినా, నిన్ను చూడను కాకా చూడను. నువెవ్వరో నాకు తెలియదు…నేనెవరో నీకు తెలియదు…యిప్పటికీ మాత్రం మనిద్దరం...అర్థమైందా! అంటూ చెప్తుంటే నీకిది షరా మామూలేనంటూ నవ్వింది.
తాగుబోతు కబుర్లు చెప్తున్నాడని నవ్వుతున్నావా! నవ్వకు..నవ్వోద్దన్నానా..అంటూ గదమాయిస్తూ గాజు గ్లాసుని ముద్దుపెట్టుకుంటూ మొదటి పెగ్గు తీసుకున్నాను.
ఏయ్, ఇంకోసారి..ఏమనుకోకు. అబ్బా ఏమున్నావే! జస్ట్ స్మాల్..ప్లీజ్ ఇంకో స్మాల్…ఇదే లాస్ట్..నిన్నిలా పెగ్గు మీద పెగ్గు ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా! నాలో ప్రవహించే కన్నీటి సముద్రాన్ని నీలోని అగ్నితో కాల్చేస్తావని…
ఒసేయ్…తనతో గడిపింది కొద్దీ రోజులే అయినా, మర్చిపోలేక...మరపన్నది తెలీని నా మనసుకు శాంతి దొరక్క ప్రశాంతత కొరకు నీకు దగ్గరయ్యాను. ప్రతి క్షణం తన తలపులతో జీవిస్తూ నరకయాతన అనుభవించే నన్ను జోకొట్టి, మత్తు నిద్రలో నన్ను నేను మర్చిపోయేలా చేసిన ఆపద్భాందవా.
అసలు నువ్వే లేకుంటే నేనేమైపోయేవాడిని. ఎప్పుడో__అయిపోయేవాడిని…కాదంటావా..నువ్వు కాదన్న..అవునన్నా నా వరకు నువ్వే నా లవర్..నా ప్యార్..నా మొహబ్బత్..నా ఇష్క్..నా జాన్..శినిజాన్. ఆ..శినిజాన్కు చెప్పు..వలపంటే తెలియని పిచ్చొడు నీ గురుంచి..నీ ప్రేమ గురించి పిచ్చొడైపోయాడని…
నన్ను తనుగా మార్చేసిన తననెలా మర్చిపోనే? ఏడుపొస్తోందే..అలాగని ఏడవలేక పోతున్నానే………..
తను ఇంతై…ఇంతింతై..అనంతమై..అంతకంత..మరింతగా నన్నల్లుకుంటూ…తనలో తాను ఇముడ్చుకుంటూ...పెనవేసుకుపోతున్న ప్రేమానుబంధాన్ని బంధాన్ని ఎలా?.....?
నువ్వే చెప్పవే…?
ఎక్కడుందో? ఎలా ఉందొ? ఎవరితో ఉందొ? గుర్తున్నానో లేదో? పెళ్లి చేసుకుందేమో? ఎంతమంది పిల్లలో? అసలు జీవితములో కలుస్తామో లేదో? కలిసినా నన్ను గుర్తుపడుతుందో లేదో? ఎన్ని ప్రశ్నలో..ప్రశ్న లెన్ని ఉన్న నాజీవితం మాత్రం తనకే అంకితం. ఎవరేమనుకున్నా నేను మాత్రం తన అనుభూతులను పదే పదే నెమరేస్తూ, నన్ను నేను మరుస్తాను.
కాదు..కాదు….
“ జీ..వి..స్తూ..మ..ర..ణి..స్తా..ను. మ..ర..ణి..స్తూ..జీ..వి..స్తా..ను. త..ను..ఎ..ప్ప..టి..కై..నా..క.లు.స్తుం.ద.నే న.మ్మ.కం.తో”
మత్తు కమ్మిన కళ్ళతో “ఐ..లవ్..యు..శి..ని జాన్..” అంటూ రెండు కాళ్ళు సోఫాపై వేసి నేను కిందనే నిద్రపోయాను.
*********
అలారం అదేపనిగా మోగుతుంది...దాని అరుపులకి తలనొప్పిగా ఉంది..బద్ధకంగా అటు ఇటు కదుల్తున్నా నాకు, సడెన్‌గా గుర్తొచ్చింది..బెంగళూరు వెళ్లాలని...వెంటనే లేచి, అలారం ఆపు చేసి, టైం చూసాను. ఉదయం ఐదు నలబైదు అయింది. క్లయింట్ తో మీటింగ్ ఉంది. ఫ్లైట్‌కి వెళ్ళాలి. మందు బాటిల్స్ తో చిందరవందరగా ఉన్న గదిని క్లీన్ చేసి నేను రెడీ అయ్యాను.
ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేసి “హలో” అన్నాను. అటునుండి డ్రైవర్ “గుడ్ మార్నింగ్ సర్” అంటుంటే “ఫైవ్ మినిట్స్‌లో వస్తున్నానంటూ” చెప్పాను.
నేనుండేది ఈసిఎల్ దగ్గర్లోని ఏఎస్ రావు నగర్లో ఉన్న కృష్ణవేణి అపార్టుమెంట్లో నివసిస్తున్నాను. నా ఫ్లాట్ నుండి కిందకు వెళ్లేసరికి డ్రైవర్ రెడీగా ఉన్నాడు. “టైం ఆరు ఇరవైదు అయింది. ఫ్లైట్ ఎనిమిది గంటలకు..టైంకి ఎయిర్పోర్ట్ వెళ్లగలమా” అని అడుగుతుంటే, “మీరెక్కండి సర్..వెళ్ళిపోతాం”. ధీమాగా అంటూ కార్ బ్యాక్ డోర్ ఓపెన్ చేసాడు.
నా వెంట తెచ్చిన బాగ్ పక్కన పెట్టి నేను సీట్లో కూచున్నాను.
ఇంతలో ఫోన్ మోగింది...చూస్తే అమ్మ, ఇంత పొద్దునే ఫోన్ చేసిందేమిటి అనుకుంటూ ఫోన్ ఎత్తాను. ఒకటి రెండు కుశల ప్రశ్నలు అయ్యాక పెళ్లి సంబంధం గురించి చెపుతూ అమ్మాయీ చాల భాగుంది. అలాంటి అమ్మాయీ దొరకమన్న దొరకదు. పెండ్లి చేసుకోరా రాఘవా. నీక్కూడా వయసు రోజురోజుకి పెరుగుతుంది. నీకు ముప్పైఐదు సంవత్సరాలు వచ్చాయి. ప్లీజ్ అర్థం చేసుకో…అంటూ నాన్‌స్టాప్‌గా చెప్తూ బ్రతిమాలుతున్న అమ్మని కోప్పడలేక..ప్రేమించిన విషయం చెప్పలేక మల్లి ఫోన్ చేస్తానమ్మా అంటూ ఫోన్ పెట్టేసాను.
ఈ తంతు గత పది సంవత్సరాలనుండి సీరియల్స్ నడుస్తున్నట్లు నడుస్తూనే ఉంది. చెప్పి చెప్పి వాళ్లకు విసుగు రావటం లేదు…విని విని నేను వారి మాటలకూ కరగటం లేదు. దీనికి అంతం ఎప్పుడో తెలియదు.
అవును మరి, “పెండ్లి ..ప్రేమ” ఈ రెండు కలసి భద్రాచలం నుండి బిజినెస్ పేరుతొ కన్నవాళ్ళ దగ్గర నుండి హైదరాబాద్‌లో ఒంటరిగా పడేసింది.
అసలెక్కడ శీనిజాన్..ఎక్కడ నేను...ఎక్కడో బాంబేలో ఉన్న తను, భద్రాచలం పేపెర్బోర్డ్స్ లో ప్రాజెక్ట్ కోసం రావటం
ఏంటి? వచ్చింది సరే, ఎన్నో బ్రాంచెస్ ఉన్న నేనున్నా బ్రాంచ్‌కి రావటం ఏంటి? పోనీ వచ్చింది. తనకు నేను..నేను తనకు నచ్చటమేంటి?...కనపడకుండా తను మాయమవటమేంటి? నేను బాధపడుతూ, ఆత్మీయులను క్షోభకు గురి చేయటమేంటి?
తను నా నుండి దూరమై సరిగ్గా పది సంవత్సరాలైంది. నేనప్పటి నుండి హైదరాబాద్‌లో స్వంతముగా ఇంటీరియర్ డిజైన్ ఆఫీస్ పెట్టుకుని నన్ను నేను పోషించుకుంటు..మరో ముగ్గుర్ని పోషిస్తున్నాను. నేను చేసే ప్రతి పనిలో..నేను వేసే ప్రతి డిజైన్ లో తన గుర్తు ఏదో ఒకటి కనపడుతుంది. అది చూసి నాలో నేను నవ్వుకుంటాను. వీలైనప్పుడల్లా తను ఎక్కడైనా కనపడుతుందేమోననే ఆశతో రకరకాల ప్లేసెస్ లో వెదుకుతుంటాను.
నా ప్రపంచమే శినిజాన్. .నేను కళ్ళు మూసినా..తెరిచినా తనే. ఈ జ్ఞాపకాల పందిరికింద తననే తలుస్తూ..లతలా అల్లుకుపోతూ..తన్మయత్వములో తేలుతుంటాను…అలానే కళ్ళు మూసుకున్నాను.
నా కళ్ళల్లో చూస్తూ తను...తన కళ్ళలోకి చూస్తూ నేను...ఇద్దరి మధ్య ఎలాంటి మాటలు లేవు. చిరునవ్వులు చిలకరిస్తూ తను...తన చిలకరింపుల పులకరింతల్లో మధురిమనై, ఇద్దరం మౌనమనే గానములో విహరిస్తూ...విరిసిన విరజాజులై పరిమళిస్తూ..ఒకరి చేతిని ఇంకొకరం పట్టుకుని…అల..అల పైపైకి ఆకాశములో చేరి..మేఘమాలికలపై నర్తిస్తూ...సుస్వరాల మోహనరాగములో ప్రణయగీతాలు ఆలపిస్తూ..ఇంతకంటే ఇంకేం కావాలి జీవితానికి అనుకుంటు ఆనందముతో ఆదమరిచిన, నన్నెవరో బలవంతముగా కిందకు లాగినట్లన్పించి కోపముతో కళ్ళు తెరిచాను.
“సర్ ఎయిర్పోర్ట్ వచ్చింది” అంటూ డ్రైవర్ వినయముగా లేపుతున్నాడు.
అందమైన కలను బ్రేక్ చేసిన డ్రైవర్ని ఏమి అనలేక..మనసులో తిట్టుకుంటూ, బరువుగా..భారముగా లగేజ్ పట్టుకుని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్లి ఫ్లైట్ ఎక్కాను.
సీట్లో కూచొని బెల్ట్ పెట్టుకున్నాను. ఇంతలో నా పక్కన కూచున్న వ్యక్తి నన్నేదో అడగబోతుంటే నేనతనికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా కళ్ళు మూసుకున్నాను. నాకు తెలీకుండానే నేను గత కాలపు మధురస్మృతుల్లోకి వెళ్ళాను.
*****
“హాయ్ రాఘవ బిజీనా!” అంటూ వచ్చాడు. నా కొలీగు వెంకటేష్. “ఇదుగో ఈ అమ్మాయీ ఏదో డౌట్ అంటే చెప్తున్నాను. చెప్పు ఏంటి విషయమంటుంటే”
“ఆబ్బె ఏం లేదు.” అంటూ “ఎవరీమె” అని అరా తీస్తూ పక్కనున్న చైర్లో కూచున్నాడు. “తను బాంబే నుండి వచ్చింది. పేరు శినిజాన్. మన కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేయటానికి వచ్చింది. ఓ ఆరు నెలలు ఉంటుంది. తనకేమో తెలుగు రాదూ..నాకేమో ఇంగ్లీష్ రాదు. ఇద్దరం వచ్చిరాని భాషతో కుస్తీ పడుతూన్నాం.”
అని అంటుంటే “ఓహో అయితే ఈ ఆరు నెలలు నువ్వు ఫుల్ ఎంజాయ్ అనుకుంట” అంటూ నవ్వుతున్నాడు.
ఎందుకో ఆ నవ్వుని..ఆ మాటల్ని భరించలేని నేను, “కొద్దిగా మర్యదగా మాట్లాడితే బాగుంటుంది. మనిద్దరం ఎలా మాట్లాడుకున్న సరిపోతుంది. పక్కవాళ్ళను మాత్రం మన మధ్యలో రానీయకు.” అని అంటుంటే “నేనేమన్నానని నా మీద కోప్పడతావు. అయినా, నువేమైనా పైనుంచి దిగొచ్చావా! మడి కట్టుకు కూర్చోడానికి నువ్వు ఓ మగాడివే గుర్తుంచుకో” అంటూ వ్యంగముగా మాట్లాడుతున్న తననుద్దేశిస్తూ, “నేను మగాడినే అనుకుంటూ గాడి తప్పను”.
అంటున్న నన్ను వారిస్తూ “తప్పయిందిరా..అసలు నీకెలాంటి అమ్మాయీ నచ్చుతుందో చెప్పరా!” “నాకు నచ్చటం కోసం..నీకు నచ్చటం కోసం అమ్మాయిలుండరు.” అంటున్న నాతొ, “మనిద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ ఎందుకు? ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయీ గురుంచి..ఈ అమ్మాయికేమైనా తెలుగు వచ్చా! మన మాటలు అర్థం కావటానికి”…అంటున్న వెంకటేష్ మాటల్ని ఖండిస్తూ “తెలుగొచ్చిన రాకపోయినా ఒకరి గురించి తప్పుగా మాట్లాడటం తప్పంటాను”. అంటున్న నన్ను చూసి తను నవ్వాడు.
నవ్వుతు “ఈ పిల్ల అందముగా లేదా!” అంటున్న తన మాటలకూ బదులిచ్చాను. “అందముగా ఉంటె ఎంజాయ్ చేయాలా! ఎంజాయ్ కోసం ఎదుటివారిని హింసించాలా! వద్దురా వెంకటేష్. అందాన్ని చూసి ఆనందిద్దాం..ఎప్పుడు కలిసిన స్వేచ్ఛగా మాట్లాడుకునేలా ప్రవర్తిద్దాం”.
“అరేయ్ రాఘవ నీకో దండం..నీ భావాలకో దండం.” అంటూనే
“సరేలే, ఈ పిల్లకి నేను లైన్ వేసుకుంటాను.” అని క్యాజువల్ గా అంటున్న వెంకటేష్‌ని “చంపేస్తా! ఇన్ని చెప్పిన నీకు అర్థం కాలేదా నువ్వసలు మనిషివా! పసువ్వా! తనేమైనా బొమ్మ అనుకున్నావా! నేను కాకపోతే నువ్వు..నువ్వు కాకపోతే ఇంకొకడు ఆడుకోటానికి” అంటూ గట్టిగ అరిచాను.”
నా అరుపుకి బయపడి “సరే మల్లి వస్తా” అంటూ పిల్లిలా బయటకు వెళ్ళాడు.
వాడు వెళ్లిన రెండు క్షణాలకు తెప్పరిల్లిన నేను, నా ప్రవర్తనకు నేను సిగ్గుపడుతూ..భాదపడుతూ వాటర్ తాగుదామని అనుకుంటుంటే, ఆ అమ్మాయీ వాటర్ ఇచ్చింది. నేను తాగుతూ ఆలోచిస్తున్నాను. ఏమి కానీ ఈ అమ్మాయీ కోసం ఎప్పుడు కోప్పడని నేను పిచ్చాడిలా ప్రవర్తించానేందుకు??
ఆలా ఆలోచిస్తూ కంప్యూటర్లో రేపటి మీటింగ్ కావాల్సిన నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతలో తను (శినిజాన్) “నాకు లైన్ వేస్తె నీకేంటి ప్రాబ్లెమ్...నీకెందుకంత కోపమంటుంటే”, “అదే కదా! నాకు అర్థం కానీ విషయం” అని యదాలాపముగా అంటూనే, “నీకు తెలుగు వచ్చా!” అంటున్న నా ఆశ్చర్యానికి అడ్డుకట్ట వేస్తూ
”..వచ్చు” అంటూనే, “నేనడిగినదానికి సమాధానం చెప్పలేదు.” అంటూ నా వైపు సూటిగా చూసింధీ.
“నీకు ఇష్టమని చెపితే లైన్ వేసుకోమని చెపుతాను.” అంటూ లేచి వెంకటేష్ అని పిలవబోతుంటే, “అగు నీ స్పీడ్ తగ్గించు.” అంటూ తన పనిలో తను మునిగిపోయింది.
తెలుగు వచ్చిన రానట్లు ఎందుకిలా నటిస్తోంది. అని ఆలోచిస్తూ మౌనముగా నా పనిలో నేను మునిగిపోయాను.
ఆఫీస్ టైం అయిపోయింది. తను ఆఫీస్ టైం అయింది, వెళదామన్నట్లు అడిగింది. కొంచెం పని వుంది. అది కంప్లీట్ చేసుకుని వెళ్తాను మీరు వెళ్ళండి అని చెప్పిన వెళ్లకుండా అలానే కూచుంది. నా పని కంప్లీట్ అయ్యేసరికి రాత్రి ఏడయ్యింది. మా మేనేజర్ కు వర్క్ రిపోర్ట్ చేసి బయల్దేరాను.
తను నాతోపాటు నడుస్తూనే చెప్తుంది. అమ్మ నాన్నలది హైదరాబాద్. వాళ్ళు వృత్తిరీత్యా బొంబేలో స్థిరపడ్డారు. మా ఇంట్లో మేం మాట్లాడేది తెలుగు. అమ్మానాన్నలది లవ్ మ్యారేజ్. నాన్న హిందు అమ్మ క్రిస్టియన్ అంటూ చెప్తుంది. ఊరు కానీ ఊరు వచ్చాను ఎవరెలాంటివారో తెలియదు. అందుకే నా జాగ్రత్తలో నేనిలా..తప్పనుకోకు. అంటూ సంజాయిషీ ఇస్తుంటే ఆమె మీద ఉన్న అపోహ కాస్త పోయింది.
అది మొదలు మా పరిచయం రోజు రోజుకి వృద్ధి చెందసాగింది..ఎంతగానంటే మీరు కాస్త నువ్వుగా.. నువ్వు ధాటి రేయ్ అనుకునేంత చనువుగా...తన ట్రైనింగ్ కంప్లీట్ అయి ఇంకా రెండు మూడు రోజులకు బాంబే వెళ్లేముందు భద్రాచలం రామాలయంకు వెళదామంటే సరేనన్నాను.
ఆ రోజు శనివారం. నేను తను ఇద్దరం ఆఫీస్ పని తొందరగా ముగించుకొని బయటకు వచ్చాము. తను హాస్టల్ కు వెళ్లి పది నిముషాల్లో ఫ్రెష్ అయి వస్తానంటూ హాస్టల్ వెళ్ళింది. సరేనంటూ, నేను పక్కనే ఉన్న ఫ్రెండ్ రూముకెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి బస్‌స్టాప్‌లో వెయిట్ చేస్తున్నాను. పది నిముషాలు కాస్త గంట అయిన రాలేదు. ఇంకా రాలేదని అటు ఇటు నేను పచార్లు చేస్తున్నాను.
ఇంతలో ఎవరో అమ్మాయీ..కనకాంబరం కలర్ పట్టు ఓణీ దానికి మాచింగ్ గ్రీన్ బ్లౌజ్, గ్రీన్ పరికిణి వేస్కుని.. సిగలో గులాబీ ధరించి..గాలికి ఎగిరే కురులను సవరించుకుంటూ..కవ్వించే కాటుక కనులతో కాటేస్తూ…తడియారని పెదవులతో మధువులొలికిస్తూ..సన్నని నాజూకైన నడుముని లయబద్ధముగా కదిలిస్తూ....హంసలా వయ్యారంగా నడుస్తుంటే..ఎవరో రాజకుమారి దారి తప్పి వచ్చిందా! లేక దివి నుండి భువికి దేవత దిగి వచ్చిందా! ఎవరీమె...అనుకుంటూ అలానే కళ్లప్పగించి..నోరెళ్ళబెట్టుకుని చూస్తున్నా….
నా దగ్గరకొచ్చి “రేయ్” అంటూ నా కళ్ళ ముందు చిటికె వేస్తుంటే, నేని లోకములోకి వచ్చాను. “ఏమైంది...స్టాట్యూ లా నుంచున్నావు.!” అంటూ ఏమి తెలియనట్లు కొంటెగా నవ్వుతుంటే, గుండెలో ఎవరో మెత్తని కత్తితో గుచ్చి, నొప్పి తెలియకుండా నవ్వుల మత్తు చల్లినట్లుంది.
“నువేనా! ఇన్నాళ్లు..” అంటూ తడబడుతూ మాట్లాడుతున్న నన్ను చూస్తూ, “అదే నేను..అదే నువ్వు” అనే పదాన్ని రాగయుక్తముగా చెప్తూ..చిరుమందహాసమొలికిస్తుంటే చిత్తరువులా నించుండిపోయాను. మాటలు రాక మూగబోయిన నా పరిస్థితిని అర్థం చేసుకున్న తనే ఆటోని పిలిచి అడ్రెస్ చెప్పింది. నేను ఆమెనే చూస్తూ ఆటో లో కూచున్నాను. గుచ్చి గుచ్చి చూసే నా చూపుల్ని తట్టుకోలేక తలదించుకున్న ఆమెని చూస్తూ ఇంత అందం...ఇన్నాళ్లు ఎక్కడ దాచింది?
ఎప్పుడు ప్యాంటు..టీ షర్ట్ వేసుకుంటూ రౌడీలా రెడీ అయి, ఆఫీస్ కొచ్చే, తనిప్పుడు అరవిరిసిన మందారంలా..ముట్టుకుంటే మాసిపోతుందా! అన్నట్లుంది. ఇన్నాళ్లు మారు వేషము వేసుకుందా! లేక నేను కళ్ళకి గంతలు కట్టుకున్నానా! మనసులో అనుకుంటూ.. ఆమెను చూస్తూ, నన్ను నేను మర్చిపోయాను. ఆటో వాలా పిలుపుతో నేనీ లోకంలోకి వచ్చాను.
ఆటో దిగి, అతనికి డబ్బులిచ్చి రామాలయం వైపు నడవటం మొదలుపెట్టాం. జారిపోతున్న గుండెలను జాగ్రత్తగా పైకెగదోసుకుంటూ…రోడ్ ప్రక్క ఉన్న షాపులో వాటర్ బాటిల్ తీసుకుని ఎండిపోతున్న గొంతుకు కొన్ని నీళ్లు పోసి తన వెనుకే నడుస్తున్నాను. ఇద్దరికీ మాటలు లేవు. ఎప్పుడు గలగలా మాట్లాడే మేమిద్దరం మొట్టమొదటి సారి అపరిచుతులమయ్యాం.
అలానే గుడిలోకి వెళ్లి, దైవ దర్శనం చేసుకుని, ఆలయ ప్రాంగణములో కూచున్నాం. తెలిసిన ప్రతి ఒక్కరు మా ఇద్దరిని ఎగాదిగా చూస్తూ “ఎవరీమె” అని అడగటం నేను “బంధువులమ్మాయి” అని చెప్పటం..నాకు ఇబ్బందిగా అనిపించి... అలానే రామాలయం నుండి నడుచుకుంటూ వచ్చి గోదావరి ఒడ్డుకు చేరుకున్నాం.
ఆ గోదారి నదిలో..ఇసుక తిన్నెల్లో మేమిద్దరమే, తను సిగ్గుల పూలతో వెన్నెలై విరబూస్తుంటే..ఆమె కన్నుల్లో చిలికే వెన్నెల నే..గ్రోలుతూ..ఆమె అందచందాలను చూస్తూ.. ఆఘ్రాణిస్తూ...ఆస్వాదిస్తూ. గర్వపు అతిశయముతో నే నడుస్తూ నా సన్నిధిలో తన్ను తానూ మైమరుస్తూ..అల..అల ఒకరి చేతిని ఇంకొకరం గట్టిగ పట్టుకుంటూ..మాపాదాల కింద మెత్తగా..మత్తుగా ఒదిగిపోతున్న ఇసుకలో పిచుక గూళ్ళు కట్టుకుంటూ…కిచకిచమంటూ అరుస్తూ...కొట్లాడుకుంటూ..కోడెగిత్తల పోట్లాడుకుంటూ అంతలోనే లేచి..ఒకరిపై మరొకరం ఇసుకతో అభిషేకించుకుంటూ..ఇద్దరమల దగ్గరగా చేరి..అది ఇదని తెలియని ఆనందంలో, ఒకరి నడుముపై ఇంకొకరం చేయివేసి..రతీమన్మధుల్లా నడుస్తూ..నదిలో నడములోతు నీళ్ళల్లోకి వెళ్ళాం. నదిలోని నీళ్లలో ఇద్దరం మునుగుతు..తేలుతూ..వణుకుతూ..తను మరింత దగ్గరగా చేరి గుండెలపై తల పెట్టి, గట్టిగ హత్తుకుంటుంటే..నేను మరింత బలముగా తనను పట్టుకుని పెదవులపై చుంబించాను. తను మరింత మత్తుగా అదిరే పెదవులతో..నా చెక్కిలిపై తను ముద్రలు వేస్తుంటే…ఆమె ఉఛ్చ్వాసనిశ్వాసాలు నాలో చేరి...నాలోని చైతన్యం ఆమెలో చేరి…తను పురి విప్పిన మయూరమై నాట్యమాడుతు నను కవ్విస్తుంటే..నే..మోహనరాగం ఆలపిస్తూ..ఇద్దరం ఒక్కరమై..ఒక్కరం మురిపమై..ముచ్చటై..పులకింతల పరిమళమై ఒకరిలో మరొకరం కరిగిపోయాం.
కళ్ళు తెరిచి చూస్తే, ప్రక్కన ఉన్న వ్యక్తి “సర్ సర్ బెంగళూరు వచ్చింది.” అంటూ నన్ను లేపుతున్నాడు. “థాంక్ యు సర్.” అంటూ అతన్ని విష్ చేసి బాగ్ పట్టుకుని అతని వెనకాలే నేను బయటకు వచ్చాను.
ఎయిర్పోర్ట్ లాంజ్ లో నాకోసం ఎదురు చూస్తూ ఓ వ్యక్తి నా పేరున్న బోర్డు పట్టుకునుంచున్నాడు. నేనతని దగ్గరకు వెళ్ళగానే అతను నన్ను కారులో వాళ్ళ గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాడు.
గెస్ట్ హౌస్ లో అడుగుపెట్టిన వెంటనే “సర్ అల్పాహారం ఏమైనా తీసుకుంటారా!” అని అడుగుతుంటే, మర్చిపోయిన ఆకలి గుర్తొచ్చింది. “వేడిగా ఇడ్లీ ఉందా” అని అడిగాను. “వేడిగానే ఉంది.” అని చెప్పాడు. “వేడిగా రెండు ఇడ్లి..రెండు వడ. అలానే మీగడ లేకుండా మంచి స్ట్రాంగ్ కాఫీ” అంటూ చెప్పాను.
చెప్పినట్లే వేడి వేడిగా టిఫిన్ సర్వ్ చేసాడు...టిఫిన్ కంప్లీట్ అయ్యేవరకు కాఫీ తెచ్చాడు. కాఫీ రుచిని ఆస్వాదిస్తుంటే.. శినిజాన్ గుర్తొచ్చింది. అచ్చం తను చేసిన కాఫీ లానే ఉండేసరికి ఏదో గగుర్పాటు. తియ్యని అనుభూతితో ఎద కంపిస్తుంటే..చవులూరించే కాఫీని నెమ్మది నెమ్మదిగా సేవిస్తూ మొత్తం తాగేశాను...ఇంకో కప్పు కాఫీ అడుగుదామనేంతలో…
ఇంతలో ఎక్కడినుండో పరిమళం. నా మనసంతా వ్యాపిస్తుంటే…అణువణువులో ఏదో అలజడి. ఆ పరిమలానందములొ పరవశిస్తూ గట్టిగా కళ్ళు మూసుకున్నాను. నా గుండె రెట్టింపు వేగముతో పరిగెడుతుంటే..నాలోని రక్తానికి దారెటో తెలియక అటు..ఇటు పరిగెడుతూ నా మనసుని ఆనందముతో ఉక్కిరిబిక్కిరి చేస్తూ…నా తనువుని నిలువనీయకుండా చేస్తుంది. తనేనా! నేను పొరపాటు పడుతున్నానా! అర్థం కానీ స్థితి.
ఆ పరిమళం మరింత దగ్గరైంది. కళ్ళు తెరవాలంటే భయముగా ఉంది. ఆ గదిలో నిశ్శబ్డం రాజ్యమేలుతున్న వేళ..గోడ మీదున్న గడియారం మాత్రం టిక్ టిక్ అంటూ సైలెన్స్‌ని బ్రేక్ చేస్తుంది.
ఎవరో నా కాళ్ళ దగ్గర కూచుని ఏడుస్తున్నట్లుంది...నేను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసాను. ఆశ్చర్యం..తనేనా! కలా!..నిజామా! గట్టిగా నా చేతిని నేనే గిల్లుకున్నాను. భరించలేని నొప్పి..ఇది నిజమే అనుకుంటూ తన వైపు చూసాను. నా దేవత నా కాళ్ళ దగ్గర. ఇక్కడ...ఇక్కడేం చేస్తుంది? తనెందుకు ఏడుస్తుంది? నేనెవరో తెలిసే వచ్చిందా! మదిలో మెదిలే సవాలక్ష ప్రశ్నలన్నింటినీ ప్రక్కన పెట్టి తనను లేపి సోఫాలో కూచోబెట్టాను.
తను చెప్పటం మొదలుపెట్టింది. భద్రాచలం నుండి వచ్చిన వారం రోజుల్లో, అమ్మనాన్నలకు కార్ ఆక్సిడెంట్ అయింది. ఆ ఆక్సిడెంట్లో అమ్మానాన్న ఇద్దరు కోమాలోకి వెళ్లిపోయారు...బాంబేలో ఉన్న డాక్టర్స్ బెంగళూరు తీసుకెళ్లమని సజెస్ట్ చేస్తే ఇక్కడికి తీసుకొచ్చాను. అమ్మ ఒక సంవత్సరం క్రితమే కోమానుండి బయటకు వచ్చింది. నాన్నగారు కూడా ఈ మధ్యే కోమా నుండి బయటకు వచ్చారు.
ఈ కష్టాల్లోకి నిన్ను రమ్మనలేక, నీకు తెలియకుండా జీవించాల్సి వచ్చింది. కొన్నాళ్ళకైనా నన్ను మర్చిపోతావని అనుకున్నాను...కానీ నా ఊహ తప్పయింది. నన్ను క్షమించు అంటూ ఏడుస్తున్న తనని “ఇంతేనా నువు నన్ను అర్థం చేసుకుంది.” అంటూ ప్రేమగా అక్కున చేర్చుకున్నాను. తనని ఓదారుస్తుంటే తన తల్లిదండ్రులు వచ్చి బాబు ఇకనుండి తనకి అన్ని నువ్వే అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న వాళ్ళని ఊరడించాను. ఆ మాట ఈ మాట మాట్లాడుకున్న కొంత సేపటికి “సరే బాబు మీరు మాట్లాడుతుండండంటూ” అంటూ బయటకు వెళ్లారు.
వాళ్ళు బయటకు వెళ్లిన వెంటనే నేను అడిగిన మొదటి ప్రశ్న నువ్విక్కడికి ఎలా వచ్చావు? అంటుంటే ..వచ్చావు కాదు. నువెలా వచ్చావో ఫస్ట్ తెలుసుకొ..మొట్టమొదటగా నువ్వు తెలుసుకోవాల్సింది. ఇది మన ఆఫీస్. టైమ్స్ అఫ్ ఇండియాలో ఇంటీరియర్ డిజైన్ మీద నీ ఆర్టికల్ చదివి...నువేనా! కాదా! అని ఎంక్వయిరీ చేయగా నువ్వే అని తేలింది.
నీకు పెళ్లయ్యిందేమోనని మీ ఆఫీస్ లో ఎంక్వయిరీ చేస్తే నువ్వు రోజుకో అమ్మాయితో జల్సా చేస్తున్నట్లు తెల్సింది. ఎవరి మాటలు నమ్మని..నేను అక్కడున్న మా ఫ్రెండ్ ద్వారా నీ గురుంచి తెలుసుకున్నాను. నువ్వు నిజముగానే అడిక్ట్ అయ్యావని తేలింది.” అంటూ నా వైపు ఓరకంటితో చూస్తూ క్షణం ఆగింది. మల్లి తనే కొనసాగిస్తూ “అది నాకే అడిక్ట్ అయ్యావని...నా కోసమే నువు పిచ్చొడయ్యావని తెలిసి నేను తల్లడిల్లిపోయాను.” అంటూ ఏడుస్తున్న తన కన్నీళ్లు తుడుస్తూ…
ఓసోసి రాక్షసి! నీకెంతటి యవ్వనాతిశయమే..! రంబ ఊర్వశులు నీ ముందు పనికిరానట్లు..నీ అంత అందెగత్తె ఇంకెవరు లేనట్లు..రుచి పచి లేని చప్పిడి జీవితం నా ముందు పడేసి, నువిలా ఈసురోమంటూ నీరసాన్ని వడ్డిస్తుంటే…రసహీనముతో చిక్కిశల్యమై బక్కచిక్కిన నేను, విరహాల సెగల్లో నా తనువును కాల్చేస్తూ..భాద భరించలేని నేను, ఓ మై జాన్..ఓ మై ప్యార్ నా శినిజాన్ అంటూ కొండాకోనలు దద్దరిలెలా నే..గొంతుచించుకు అరుస్తు..శోష వచ్చి పడిపోయిన నాకు ఓ ముద్దు లేదు..ఓ ముచ్చట లేదు..ఓ కులుకు లేదు..ఓ తళుకు లేదు. సారీ అంటూ సింపుల్‌గా చెప్పేసి..దప్పికతో వేసారిన నా దేహానికి దాహం తీర్చకుండా..సరసాల మధురరసాలు పోయకుండా వెళ్లిపోదామనుకుంటున్నావా! ఒసేయ్ ఒయ్యారి! దీనికి పరిహారమేంటో తెలుసా! ఇప్పటి నుండి జీవితాంతం వరకు తీయ తీయని ఊసులతో, తీరైన రీతిగా ప్రతి రేయి అందమైన కథలతో నన్ను మెప్పిస్తూ అది మధురం..దధి మధురం...మధురాధిపతే అఖిలం మధురమంటూ మధురమై పోవాలి.. ఇదే నీకు నే..విధించే శిక్ష. అంటూ ఎన్టీఆర్ గారి స్టైల్ లో కోపాన్ని అభినయిస్తూ చెపుతుంటే…..
నా పలుకులకు తన నవ్వుల పూల వానల సుగంధాలలో నను తడిపేస్తుంటే..నే తడుస్తూ ఆమె సోగసైన కంఠంపై చిరు ముద్దుల మాలతో అలంకరించే పనిలో బిజీ అయ్యాను.
###The End###
Comments
Post a Comment